రాజకీయంగా దెబ్బతీసేలా సొంత కూతురు చేస్తున్న ఆరోపణల నుండి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కాస్త ఊరట లభించింది. 

జనగామ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై సొంత కూతురు తుల్జాభవాని తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ముత్తిరెడ్డి కూతురు ఆరోపిస్తోంది. అయితే తాజాగా తుల్జాభవాని తన తండ్రి ముత్తిరెడ్డి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

తన కూతురు తుల్జాభవాని చేస్తున్న ఆరోపణలతో పరువుకు భంగం కలుగుతోందని... వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ముత్తిరెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. తుల్జాభవాని తన తండ్రి గురించి మీడియా ముందు మాట్లాడవద్దని కోర్టు సూచించింది. అలాగే సోషల్ మీడియాలో కూడా తండ్రి గురించి పోస్టులు, ఫోటోలు, వీడియోలు పెట్టకూడదని ఆదేశించింది. ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా కూడా ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ఆయన కూతురు తుల్జాభవానికి కోర్టు నోటీసులు జారీ చేసారు. 

కొంతకాలంగా తండ్రి ముత్తిరెడ్డిని టార్గెట్ చేస్తూ తల్జాభవాని ఆరోపణలు చేస్తున్నారు. తన తన తండ్రి మంచోడు కాదని... అత్యంత అవినీతిపరుడని బహిరంగంగానే మాట్లాడుతున్నారు ముత్తిరెడ్డి కూతురు. అసలు ప్రజలు ఆయనను ఎందుకు ఎన్నుకున్నారో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ప్రశ్నించాల్సింది.. ఓడించాల్సింది ప్రజలే అంటూ తుల్జాభవాని సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Read More "మా నాన్న అవినీతిపరుడు.. ఆయనను ఎందుకు ఎన్నుకున్నారో తెలియదు" : ముత్తిరెడ్డి కూతురు సంచలన వ్యాఖ్యలు

తనను వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్న కూతురిపై ముత్తిరెడ్డి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన కూతురుపై చేర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. అయినప్పటికి కూతురు తనపై ఆరోపణలు చేయడం ఆపకపోవడంతో ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.