నవీన్ హత్య కేసు: హరిహరకృష్ణ లవర్, హసన్ లకు రిమాండ్, జైలుకు తరలింపు
హైద్రాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో అరెస్టైన హసన్, నీహరికారెడ్డిలను పోలీసులు జైలుకు తరలించారు. వీరిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు పోలీసులు.
హైదరాబాద్: నవీన్ హత్య కేసులో పోలీసులు హరిహరకృష్ణ లవర్ , హసన్ లకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.. దీంతో వీరిద్దరిని జైలుకు తరలించారు పోలీసులు.గత నెల 17వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో నవీన్ ను హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హత్య చేశాడు.ఈ హత్య విషయాన్ని తన లవర్ కు , స్నేహితుడు హసన్ కు కూడా చెప్పాడు హరిహరకృష్ణ .
నవీన్ హత్య గురించి తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచి పెట్టినందుకు పోలీసులు హసన్ ను , హరిహరకృష్ణ లవర్ పై కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సోమవారం నాడు రాత్రి హైద్రాబాద్ వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో హసన్, హరిహరకృష్ణ లవర్ కు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు వీరిద్దరిని హజరుపర్చారు. ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాళ ఉదయం వీరిద్దరిని జైలుకు తరలించారు పోలీసులు. హసన్ ను చర్లపల్లి జైలుకు , హరిహరకృష్ణ లవర్ ను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు.
నవీన్ ను హత్య చేసిన తర్వాత వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హరిహరకృష్ణ తిరిగి వచ్చాడు. నవీన్ గురించి ఎవరైనా ఫోన్ చేసినా తనకు తెలియదని హరిహరకృష్ణ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కూడా హరిహరకృష్ణ ఉచిత సలహ ఇచ్చాడు. నవీన్ కు డ్రగ్స్ అలవాటు ఉందని కూడా స్నేహితులకు చెప్పాడు. డ్రగ్స్ కోసం అర్ధరాత్రి తనతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడని హరిహరకృష్ణ నవీన్ కోసం ఫోన్ చేసిన ఫ్రెండ్ కు సమాచారం ఇచ్చిన ఆడియో సంభాషణ కూడా వెలుగు చూసిన విషయం తెలిసిందే.
also read:నవీన్ హత్య కేసులో కీలక మలుపు: హరిహరకృష్ణ లవర్ అరెస్ట్
వారం రోజుల పాటు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నవీన్ హత్యకు ముందు హత్య తర్వాత ఏంజరిగిందనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు కూడా హరిహరకృష్ణను పోలీసులు విచారించనున్నారు. నిన్న హరిహరకృష్ణ లవర్ , స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో హరిహరకృష్ణకు ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లవర్ కోసం నవీన్ ను హత్య చేసినట్టుగా హరిహరకృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నవీన్ ను హత్య చేయాలని మూడు మాసాల క్రితమే ప్లాన్ చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. మలక్ పేట సూపర్ మార్కెట్ లో కత్తిని కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.