భార్యభర్తలిద్దరూ.. బైక్ పై సరదాగా వెళుతున్నారు. అయితే.. భర్త మాత్రం హెల్మెట్ పెట్టుకోగా.. భార్య పెట్టుకోలేదు. అంతలోనే వాళ్లకు ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. అంతే.. ట్రాఫిక్ పోలీసులను చూసి వాళ్లు భయంతో వణికిపోయారు. హెల్మెట్ లేదని ఇద్దరికీ జరిమానా వేస్తారని వారు భయపడిపోయారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వారు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ.. ఆ ప్లాన్ కాస్తా బెడసి కొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం ఓ జంట బైక్‌పై షాద్‌నగర్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపడుతుండటాన్ని చూశారు. భర్తకు హెల్మెట్‌ ఉంది కానీ, భార్యకు లేదు. దీంతో ఆ జంట ముందుకు పోలేక..వెనక్కి వెళ్లలేక ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భర్త తన భార్యను బస్సెక్కించాడు.

ఐడియా బాగానే ఉన్నా...కాస్త ఇక్కట్ల పాలయ్యేలా చేసింది. శంషాబాద్‌లో బస్సు దిగాల్సిన భార్య అక్కడ దిగకుండా సాతంరాయి వద్ద బస్సు దిగింది. అక్కడ నుంచి తిరిగి శంషాబాద్‌ రావడానికి ఆటో ఎక్కగా ఆటోవాలా కాస్త ఆమెను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దించేశాడు. ఎయిర్‌పోర్టులో దిగిన సదరు మహిళ తాను తప్పిపోయానని తెలుసుకుని ఏడుస్తుండటంతో ఆమెను గమనించిన పోలీసులు షీ టీమ్‌కు అప్పగించగా.. వారు పూర్తి వివరాలు తెలుసుకుని ఆమెను భర్తకు అప్పగించారు.