సెల్పీ వీడియో తీసుకుంటూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 

జనగామ : తమ భూమిని కబ్జా చేసారంటూ సెల్ఫీ వీడియో తీసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషాద ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. ఆత్మహత్యాయత్నానికి ముందు వారు తమకు జరిగిన అన్యాయం గురించి కన్నీరు పెట్టుకుంటూ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి కారణమైనవారి పేర్లతో సూసైడ్ లెటర్ ద్వారా దంపతులు బయటపెట్టారు. ఇలా కబ్జాకు గురయిన భూమిలోనే పురుగుల మందు డబ్బాతో సెల్పీ వీడయో తీసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 

బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా నర్మెట్ట మండలం సూర్యబండ తండాలో గురు, సునీత దంపతులకు వారసత్వంగా వచ్చిన కొంత భూమి వుంది. రాళ్లు రప్పలతో కూడి వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడంతో ఆ భూమివైపు దంపతులు వెళ్ళలేదు. దీంతో ఆ భూమిపై కన్నేసిన కొందరు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నిచారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు, కోర్టులను ఆశ్రయించినా కబ్జా భూమి తమకు దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. 

తమ భూమిని కబ్జా చేసినవారు, అందుకు సహకరించిన వారి పేర్లను ఓ సూసైడ్ లెటర్ రాసుకున్నారు దంపతులు.ఓ పురుగుల మందు డబ్బా తీసుకుని కబ్జాకు గురయిన తమ భూమివద్దకు వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సెల్పీ వీడియో తీసుకున్నారు. కన్నీరు పెట్టుకుంటూ తమ బాధను చెప్పుకున్న గురు, సునీత దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Read More ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు: జనగామలో నిలిపివేత

గురు, సునీత దంపతులు అపస్మారక స్థితిలో పడివుండగా చుట్టుపక్కల పొలాలవారు గమనించారు. వెంటనే వారిని జనగామలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం దంపతులకు చికిత్స అందిస్తున్నారు...ఇద్దరి పరిస్థితి విషమంగానే వున్నట్లు సమాచారం. 

తమ భూమిని కబ్జా చేయడమే కాదు మూడుసార్లు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని సెల్ఫీ వీడియోలో దంపతులు పేర్కొన్నారు. తాము చనిపోయాక కూడా భూమి కబ్జా చేసిన వారికే అని తేలితే వారికే ఇవ్వాలని... లేదంటూ తమ ఇద్దరు పిల్లల పేరిట చేయాలని కోరారు. స్థానికులంతా ఒక్కటై తమకు భూమి దక్కకుండా చేస్తున్నారని దంపతులు వాపోయారు.