దేశ విభజన చారిత్రక తప్పిదం, బాధ్యులెవరో చెప్పగలను: అసదుద్దీన్ ఒవైసీ
దేశ విభజన చారిత్రక తప్పిదం అని, అది జరిగి ఉండకూడనిది అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ తప్పిదానికి బాధ్యులెవరో కూడా తాను ఒక సంవాదం ఏర్పాటు చేస్తూ కూలంకషంగా వివరించగలనని తెలిపారు.
న్యూఢిల్లీ: ఎంఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించాల్సింది కాదని, అది చారిత్రక తప్పిదం అని వివరించారు. ఓ విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘చారిత్రకంగా మనది ఒకే దేశం, దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని విభజించారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. నేను చెప్పాలనుకున్నది ఇది. మీరు సంవాదం ఏర్పాటు చేస్తే.. దేశ విభజనకు కారుకులెవరో నేను వివరిస్తాను. ఆ సమయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడిన ఘటనకు సంబంధించి నేను కేవలం ఏక వాక్య సమాధానం చెప్పను’ అని ఒవైసీ అన్నారు.
భారత్, పాకిస్తాన్‌లను వేర్వేరు దేశాలుగా విడగొట్టాలనేది హిందూ మహాసభ డిమాండ్ అని, అది మొహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ కాదని సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై స్పందించాలని విలేకరులు ఒవైసీకి ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు.
Also Read: మ్యానిఫెస్టో లేకుండానే బరిలోకి.. ఐనా విజయాలు.. ఈ సారి కూడా ఆ పార్టీది ఇదే దారి?
‘దేశ విభజన జరిగి ఉండాల్సింది కాదు. అది కచ్చితంగా తప్పే. అప్పుడు ఉన్న నాయకులంతా ఈ తప్పిదానికి బాధ్యత వహించాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన ఇండియా విన్స్ ఫ్రీడ్ అనే పుస్తకం మీరు చదివితే ఒక విషయం తెలుస్తుంది. దేశాన్ని విభజించరాదని మౌలానా ఆజాద్ అప్పటి కాంగ్రెస్ నేతలు అందరికీ విజ్ఞప్తి చేశారు’ అని వివరించారు. అంతేకాదు, అప్పటి ఇస్లామిక్ స్కాలర్లు కూడా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారని తెలిపారు.