తెలంగాణ ఉద్యమంలో బీజేపీ లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మోదీ పదే పదే తెలంగాణపై విషం కక్కుతున్నారన్నారు. 

నల్గొండ : కేంద్రంలోని బిజెపి సర్కార్.. కాంగ్రెస్ పార్టీల మీద తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో బిజెపి పాత్ర అసలు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారు అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా ఆరు గ్యారెంటీ స్కీమ్స్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఆచరణకు వీలుకాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని.. అలా చేయొద్దన్నారు. ఈ స్కీమ్స్ ను ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 

కొత్త పార్లమెంట్ భవనం: కొలువుదీరిన లోక్ సభ

ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవడానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ తీసుకువస్తోందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో బిజెపి పాత్ర ఏ మాత్రం లేదని ఘాటుగా విమర్శించారు.