కరోనా వ్యాక్సిన్ కొరత... కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
కరోనా బారినుండి ప్రజలను కాపాడేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో కొరత ఏర్పడేలా కనిపించడంతో తెలంగాణ సర్కార్ ముందస్తుగానే అప్రమత్తమైంది.
హైదరాబాద్: తెలంగాణలో ఓవైపు కరోనా కేసులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న సమయంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడే అవకాశం ఏర్పడింది. కరోనా బారినుండి ప్రజలను కాపాడేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని భావిస్తున్న నేపథ్యంలో కొరత ఏర్పడేలా కనిపించడంతో తెలంగాణ సర్కార్ ముందస్తుగానే అప్రమత్తమైంది. వ్యాక్సిన్ విషయమై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కరోనా వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని ఈ లేఖలో కేంద్రాన్ని కోరారు సీఎస్ సోమేశ్ కుమార్.
ప్రస్తుతం తెలంగాణలో కేవలం మూడు రోజులకు మాత్రమే కరోనా డోసులు మిగిలి ఉన్నాయి. అంటే రోజుకు 1.15 లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్న నేపథ్యంలో 5.66 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే తెలంగాణ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో రోజుకు 2 లక్షల డోసులు పంపిణీ చేయాలని భావిస్తున్నాం... కాబట్టి వచ్చే 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల డోసులు వెంటనే పంపిణీ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
read more తెలంగాణ ఎస్ఈసీ పార్థసారథికి కరోనా.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పాజిటివ్
ఇదిలావుంటే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసిందని... కాబట్టి మానవత్వంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. కరోనా అంటే ఏడాది క్రితం వున్న భయం ఇప్పుడు లేదని ఈటల చెప్పారు. కోవిడ్ ట్రీట్‌మెంట్‌తో పాటు నాన్‌కోవిడ్ రోగులకు వైద్యం అందించాలని రాజేందర్ సూచించారు.
ప్రజల దృష్టిలో కార్పోరేట్ ఆసుపత్రులపై సరైన భావన లేదని ఈటల చెప్పారు. అన్ని చోట్లా 108 వాహనాలు అందుబాటులో వున్నాయన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో నిబంధనల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 14 వేలకు పైగా బెడ్స్ వున్నాయని ఈటల చెప్పారు. తెలంగాణలో లాక్‌డౌన్ ప్రసక్తే లేదని.. సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని రాజేందర్ పేర్కొన్నారు.
ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలని.. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్రలో కేసులు పెరిగాయని ఆయన చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయని... కేసుల సంఖ్య పెరిగినా, వైరస్ తీవ్రత తగ్గుతుందని రాజేందర్ వెల్లడించారు. మిగతా రోగాలకు ఎలా ట్రీట్ చేస్తున్నారో.. కోవిడ్‌ను ఇప్పుడు అలాగే ట్రీట్‌మెంట్ చేస్తున్నారని ఈటల చెప్పారు.