హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేకుపోవడంతో  టీకా వేయించుకొనేందుకు వచ్చిన ప్రజలు ఆసుపత్రుల నుండి తిరిగి వెళ్లిపోతున్నారు.రాష్ట్రానికి  సుమారు 15 లక్షల కరోనా డోసులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు.  అయితే  రాష్ట్రానికి  కేవలం  3 లక్షల డోసులు మాత్రమే మంగళవారం నాటికి చేరుకొన్నాయి.కరోనా వ్యాక్సిన్  వేసుకొనేందుకు ఏరియా ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లకు వస్తున్న ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో లేదనే సమాధానం వస్తోంది. కొన్ని సెంటర్లలో కోవిడ్  వ్యాక్సిన్ అందుబాటులో లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

45 ఏళ్లు దాటిన వారంతా కరోనా వ్యాక్సిన్ వేసుకొనేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చింది.  దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరిగింది. దీంతో  వ్యాక్సిన్ వేసుకొనేందుకు జనం ఆసుపత్రుల వద్దకు క్యూలు కట్టారు.  వ్యాక్సిన్  కు డిమాండ్ పెరగడంతో  ఆ మేరకు టీకా నిల్వలు లేక ప్రజలు ఆసుపత్రులకు వచ్చి వెను దిరుగుతున్నారు. అయితే మొదటి డోసు వేసుకొన్న వారికి  సెకండ్ డోస్ కూడ  వ్యాక్సిన్ కొరత కారణంగా వేయలేని పరిస్థితి నెలకొంది.

వ్యాక్సిన్ కొరత కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో టీకా ఉత్సవ్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఏపీకి చేరుకొన్న వ్యాక్సిన్ ను ఆయా జిల్లాలకు సరఫరా చేశారు.దేశ వ్యాప్తంగా సుమారు 41.6 లక్షల వ్యాక్సిన్ ఇస్తున్నామని కేంద్రం ప్రకటించింది.  ఆయా రాష్ట్రాలు కరోనా డోసుల వినియోగంలో ప్లాన్ చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఒక్క జిల్లాలో ఎక్కువ డోసులు వినియోగించుకొంటే తక్కువ వినియోగించుకొనే జిల్లా నుండి  డోసులను వాడుకోవాలని కేంద్రం సూచించింది.

కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రస్తుతం ఇండియా అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది.ఈ వ్యాక్సిన్ కూడ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మూడు వ్యాక్సిన్లతో పాటు విదేశాల్లో  అనుమతి పొందిన వ్యాక్సిన్లకు కూడ ఇండియాలో అనుమతించనున్నారు.