కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్... మూతపడ్డ వేములవాడ రాజన్న ఆలయం
కరోనా సెకండ్ వేవ్ కారణంగా వేములవాడ లో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కరీంనగర్: దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోనే కోరలు చాస్తోంది. దీంతో గతేడాది మాదిరిగానే ఒక్కో దేవాలయం మూతపడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వేములవాడ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రముఖ హిందూ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కొద్దిరోజులు మూసివేస్తున్నట్లు సంబంధిత దేవాదాయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 18 నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేసినట్లు... కేవలం అర్చకులు మాత్రమే స్వామివారి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఈనెల 21న రాజన్న సన్నిధిలో జరగనున్న సీతారాముల కళ్యాణం అంతర్గతంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (మంగళవారం రాత్రి 8గంటల నుండి బుధవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,06,627మందికి కరోనా టెస్టులు చేయగా 3307మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,38,045కు చేరితే టెస్టుల సంఖ్య 1,13,60,001కు చేరాయి.
ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 897మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,08,396కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,861యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 18,685గా వుంది.
ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఎనిమిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1788కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.52శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 88.3శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 91.22శాతంగా వుంది.
జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 54, నాగర్ కర్నూల్ 48, జోగులాంబ గద్వాల 15, కామారెడ్డి 128, ఆదిలాబాద్ 91, భూపాలపల్లి 11, జనగామ 36, జగిత్యాల 155, అసిఫాబాద్ 25, మహబూబ్ నగర్ 78, మహబూబాబాద్ 20, మెదక్ 67, నిర్మల్ 148, నిజామాబాద్ 279, సిరిసిల్ల 75, వికారాబాద్ 60, వరంగల్ రూరల్ 34, ములుగు 10, పెద్దపల్లి 61, సిద్దిపేట 87, సూర్యాపేట 66, భువనగిరి 52, మంచిర్యాల 75, నల్గొండ 102 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 446కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 314, రంగారెడ్డి 277, కొత్తగూడెం 48, కరీంనగర్ 94, ఖమ్మం 101, సంగారెడ్డి 153, వరంగల్ అర్బన్ 86కేసులు నమోదయ్యాయి.