రాష్ట్రంలో గత 2 వారాలుగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని తెలిపారు.  వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని శ్రీనివాస్ తెలిపారు.

కొవిడ్‌ కట్టడికి తెలంగాణ మార్గనిర్దేశంగా మారిందని గ్రామాల్లోనూ కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఆయన వెల్లడించారు. ఇంటింటి సర్వే ద్వారా కోవిడ్ బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.  

రెండో దశలో ఇప్పటి వరకు 2.37 లక్షల కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటి వరకు 1.92 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.56శాతంగా ఉందని శ్రీనివాసరావు వివరించారు.

Also Read:ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడా.. 3 హాస్పిటల్స్‌కు నోటీసులు, లైసెన్స్ రద్దు

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సరిపడా పడకలు ఉన్నాయని .. 40 శాతానికిపైగా పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండాయని డీహెచ్ వెల్లడించారు. రాష్ట్రంలో 33 శాతం ఆక్సిజన్‌ పడకలు, 493 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

కొవిడ్‌ చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా 53,756 పడకలు కేటాయించినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,265 ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు నిర్వహిస్తున్నామని.. మే 1 నాటికి కరోనా నుంచి 81 శాతం మంది కోలుకున్నట్లు డీహెచ్ వివరించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 90.48 గా ఉందన్నారు.  వ్యాక్సినేషన్‌ మళ్లీ ప్రారంభమయ్యే తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. టీకాల కొరత వల్ల వ్యాక్సినేషన్‌ను తరచూ ఆపాల్సి వస్తోందని తెలిపారు