మెదక్: తెలంగాణలో మరోసారి కరోనా కలకలం మొదలయ్యింది. ఇటీవల పలు బడులలో విద్యార్థులు, టీచర్లు కరోనా బారినపడగా తాజాగా వైరస్ వ్యాప్తి గుడులకు పాకింది. ఈ మహమ్మారి కారణంగా ప్రముఖ  ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూతపడింది. 

ఏడుపాయల ఆలయ ఈవోకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆలయాన్ని ఈ నెల 19 నుంచి 25వ తేదీ వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. భక్తులు అప్పటివరకు అమ్మవారి దర్శనానికి రావద్దని అధికారులు సూచించారు. 

ఇటీవల శివరాత్రి ఉత్సవాలు ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో ఘనంగా జరిగాయి. వివిద ప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అలాంటిది ఆల‌య ఈవోకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌న్న వార్త భ‌క్తుల్లో తీవ్ర ఆందోళ‌న‌కు కారణమయ్యింది. 

ఇలా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో(బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 62,972మందికి కరోనా టెస్టులు చేయగా 313మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,02,360కు చేరితే టెస్టుల సంఖ్య 94,82,649కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 142మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,98,262కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 2,434 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 943గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1664కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.2శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.64శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 3,నాగర్ కర్నూల్ 1, జోగులాంబ గద్వాల 4,  కామారెడ్డి 16, ఆదిలాబాద్ 10, భూపాలపల్లి 1, జనగామ 5, జగిత్యాల 8, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 5, మెదక్ 1, నిర్మల్ 25, నిజామాబాద్ 15,  సిరిసిల్ల 12, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 2,  ములుగు 2, పెద్దపల్లి 3, సిద్దిపేట 7, సూర్యాపేట 7, భువనగిరి 8, మంచిర్యాల 10, నల్గొండ 8 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 47కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 20, రంగారెడ్డి 29, కొత్తగూడెం 3, కరీంనగర్ 9, ఖమ్మం 8,  సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్ 8కేసులు నమోదయ్యాయి.