హైద్రాబాద్‌లో వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డు సస్పెండ్
హైద్రాబాద్ నగరంలో ఓ వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును సస్పెండ్ చేశారు సీపీ అంజనీ కుమార్. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు వారం రోజుల క్రితం తన విధులు ముగించుకొని ఇంటికెళ్తోంది.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో ఓ వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును సస్పెండ్ చేశారు సీపీ అంజనీ కుమార్. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు వారం రోజుల క్రితం తన విధులు ముగించుకొని ఇంటికెళ్తోంది.
ఈ సమయంలో ముషీరాబాద్ చెక్ పోస్టు వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ హొంగార్డు వెంకటేష్ ఆమెను అడ్డగించాడు. డాక్టర్ ఇంటితో పాటు ఇతర వివరాలు, ఫోన్ నెంబర్ ను కూడ ఆయన తీసుకొన్నాడు.
అదే రోజు నుండి డాక్టర్ ఫోన్ కు అసభ్యకరమైన ఎస్ఎంఎస్ లు పంపుతున్నాడు. పొరపాటున వచ్చిందని తొలుత ఆమె భావించింది. అయితే రోజూ ఇదే రకంగా ఎస్ఎంఎస్ లు రావడంతో ఇక భరించలేక ఆమె వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
also read:తెలంగాణలో కొత్తగా 41 కేసులు.. 24 మంది డిశ్చార్జ్: 1,854కు చేరిన సంఖ్య
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ డాక్టర్ ను వేధిస్తున్న విషయాన్ని విచారణలో గుర్తించారు. వెంటనే హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ హోంగార్డు వెంకటేష్ ను సస్పెండ్ చేశారు.
కరోనా రోగులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి చికిత్స చేస్తున్న వైద్యుల పట్ల పోలీసు శాఖలో పనిచేస్తున్న వెంకటేష్ వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై సీపీ అంజనీకుమార్ వెంటనే చర్యలు తీసుకొన్నారు.