జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ తన భార్యను దారుణంగా హత్య చేసి అనంతరం పోలీసులకు  లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే... ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం గ్రామం పెన్షన్ పురం కాలనీకి చెందిన సివిల్ కానిస్టేబుల్ అయూబ్‌ఖాన్ (40) జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఆయనకు భార్య తస్లీమా సుల్తానా (35)తో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.  అయూబ్ గత కొన్ని రోజులుగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కోర్టు డ్యూటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం అతను పెన్షన్‌పురంలోని రోడ్డుపై కత్తి చేతిలో పట్టుకుని వీరంగం సృష్టించాడు.

Also Read:టీవీ సీరియల్ చూసి... భార్య హత్యకు స్కెచ్..

అంతేకాకుండా మామునూరులోని టీఎస్ఎస్పీ బెటాలియన్‌ ప్రహరీ దూకి హల్ చల్ చేయగా అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌లోనే ఉన్న అయూబ్‌ఖాన్‌ను భార్య తస్లీమాతో పాటు బంధువులు విడిపించారు.

ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో భార్యను బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరిన అతను బెటాలియన్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లాడు. అయితే అక్కడం ఏం జరిగిందో తెలియదు కానీ... పురాతన క్వార్టర్ వద్ద తస్లీమా గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు.

Also Read:వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

అనంతరం నేరుగా ఇంటికి వెళ్లి, సాయంత్రం మళ్లీ రోడ్డుపైకి వచ్చిన అయూబ్‌ఖాన్ భార్యను హత్య చేశానని చెప్పాడు. అక్కడ బెటాలియన్ సిబ్బందికి అనుమానం వచ్చి మామునూరు పోలీసులకు తెలియజేయగా వారు ఘటనాస్థలికి చేరుకుని అయూబ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, తన భార్యను హత్య చేశానని.. పురాతన క్వార్టర్‌లో మృతదేహం వుందని తెలిపాడు. అయూబ్‌ఖాన్ ఇచ్చిన సమాచారంతో శనివారం రాత్రి పురాతన క్వార్టర్ వద్దకు వెళ్లి గాలించగా.. తస్లీమా సుల్తానా మృతదేహం లభించింది. అనంతరం ఆమె భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.