మేడ్చల్: తెలంగాణలోని దిండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తనను వేధిస్తూ, మరో మహిళతో సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. తన భార్య లావుగా ఉందనే కోపంతో ఆమెను విేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. దాంతో మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీలత భర్త శివకుమార్ హైదరాబాదులోని సనత్ నగర్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీలతను వేధిస్తూ వస్తున్నాడు. లావుగా ఉందనే కోపంతో అతను ఆమెకు అన్నం కూడా పెట్టేవాడు కాదని పోలీసులు తెలిపారు. 

కొన్ని నెలల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ శివకుమార్ కు ఓ వివాహిత పరిచయమైంది. దాంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో శ్రీలత తీవ్ర మనస్తాపానికి గురైంది. శ్రీలత ఆత్మహత్య ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కాగా, తమ కూతురిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తమ అమ్మాయి శ్రీలతను కానిస్టేబుల్ శివకుమార్ కు ఇచ్చి వివాహం చేసినట్లు వారు తెలిపారు వివాహం జరిగినప్పటి నుంచి అదనపు కట్న కోసం వేధిస్తున్నాడని వారు చెప్పారు. శివకుమార్ ఆరేళ్ల కూతురు తన తండ్రి దాష్టీకంపై కన్నీరు పెట్టుకుందని చెప్పారు. అమ్మను రోజూ కొట్టేవాడని, అన్నం పెట్టకుండా వేధించేవాడని ఆ పాప చెబుతోంది. బయటి నుంచి కోపంతో వచ్చి అమ్మను కొట్టేవాడని అంటోంది.