తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరగ్గా దాన్ని తాము భగ్నం చేసామంటూ సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపగా తాజాగా ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఘటనపై నిరసనకు సిద్దమయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్ర జరిగిందన్న పోలీసుల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు మంత్రి హత్య పన్నగా తాము ఆ పన్నాగాన్ని భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల పక్షాన పోరాడిన శ్రీనివాస్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంత్రి పదవిలో వున్నారని... అలాంటి వ్యక్తిని చంపాలనుకున్న అసలు కుట్ర దారులను శిక్షించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసి (telangana employees jac) నాయకులు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను ఖండిస్తూ హైదరాబాద్ లో టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమయ్యింది. టీఎన్జీవో అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో నాంపల్లి లోని టీజీవో భవన్ లో నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని మంత్రికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఉద్యోగులు, అధికారుల సంక్షేమం కోసం తపించే శ్రీనివాస్ గౌడ్ ని చంపేందుకు కుట్ర పన్నిన వారిని వెంటనే గుర్తించాలని... కుట్ర వెనకున్న అసలు కారకులను కఠినంగా శిక్షించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ... శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన కుట్రను ఉద్యోగ సంఘాలతో పాటు ఎంప్లాయిస్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి కుట్రలు జరగడం దారుణమన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ పాలమూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకుని కాపాడుకోవడానికి ముందుగానే పసిగట్టి కుట్రను భగ్నం చేసిన పోలీస్ శాఖను అభినందిస్తున్నామని మమత పేర్కొన్నారు.
''మంత్రిపై జరిగిన కుట్రకు నిరసనగా మూడురోజులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని మమత తెలిపారు. మంత్రిపై కుట్రపన్నిన వారిని వెంటనే శిక్షించాలని రాష్ట్ర హోంమంత్రి, డిజిపిని కోరుతున్నామన్నారు. రాజాకీయంగా ఎదుర్కోకుండా ఇలా కుట్రలకు పాల్పడడం పిరికిపంద చర్యగా మమత పేర్కొన్నారు.
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ... పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు... తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర జరగ్గా పోలీసులు ఛేదించారని గుర్తుచేసారు. మహబూబ్ నగర్, పాలమూరు అభివృద్ధికి కృషిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నంకి పాల్పడడం దౌర్భాగ్యమన్నారు. రాజకీయంగా, అభివృద్ధిలో పోటిపడాలి తప్ప ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. మంత్రి హత్యకు జరిగిన కుట్రను తెలంగాణ ఉద్యోగులందరం ఖండిస్తున్నామన్నారు.
మంత్రి హత్యకు కుట్రపన్నిన నిందితులు ఎలాంటివారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కుట్రను భగ్నం చేసి కేవలం 24గంటలల్లో నిందితులను పట్టుకున్న పోలీస్ యంత్రాగాన్ని అభినందిస్తున్నామన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఉద్యోగులందరం అండగా ఉంటామని రాజేందర్ తెలిపారు.
