నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. ఆధారాలున్నాయ్: మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై సుకేశ్ చంద్రశేఖర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ స్పందిస్తూ తాను క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు.

న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ఆర్థిక నేరస్తుడు, మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ స్పందించారు. జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ తాను క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. అంతేకాదు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నట్టు చెప్పారు. వారికి క్షమాపణలు చెప్పే ఛాన్సే లేదని పేర్కొన్నారు. వారిపై తాను చేసిన ఆరోపణలకు తన వద్ద ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. అవసరమైతే దర్యాప్తునకు కూడా తాను సిద్ధమని చెప్పారు.
ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ లేఖ తన దృష్టికి రాగానే కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. తనపై మతిలేని ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేశాడని సుకేశ్ చంద్రశేఖర్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేస్తూ సుకేశ్ చంద్రశేఖర్ పై స్ట్రాంగ్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటానని పేర్కొన్నారు. కేటీఆర్ తన అడ్వకేట్‌తో లీగల్ నోటీసులను సుకేశ్ చంద్రశేఖర్‌కు పంపించారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్‌లోనూ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తన పై ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ఆప్ నేతలపై సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ నేతలపై ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
మ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా తాను ఈడీకి స్టేట్‌మెంట్లు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కేటీఆర్, కవితల సన్నిహితులు తనపై ఒత్తిడి తెస్తున్నారని గవర్నర్ తమిళసైకి రాసిన లేఖలో సుకేశ్ ఆరోపించారు. ఆ ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీలో సీటు ఇస్తామని లోభపెడుతున్నట్టూ పేర్కొన్నారు. సుమారు రూ. 200 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సుకేశ్ తెలిపారు. కవితకు, తనకు జరిగిన వాట్సాప్ చాట్ రికార్డింగ్ ఉన్నదని, ఇప్పటికే ఈ ఆధారాలను 65 బీ సర్టిఫికేట్ రూపంలో ఈడీకి ఇచ్చేసినట్టు పేర్కొన్నారు. రూ. 15 కోట్లు తీసుకుని అరవింద్ కేజ్రీవాల్ తరఫునకు చెందిన వారికి అందించానని ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్టు నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించారు.