ఇక 70 ఎంఎం సినిమా చూపిస్తా: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీంతో ఇతర పార్టీల నుండి బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ లో చేర్చుకుంది.
మునుగోడు: ఇక 70 ఎంఎం లో కాంగ్రెస్ సినిమా చూపిస్తానని మునుగోడు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా మునుగోడు నుండి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
ఆదివారంనాడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. తాను బీజేపీలో ఉన్న సమయంలో పార్టీ పరిస్థితిపై ఇతర అంశాలపై నిర్మోహమాటంగా అమిత్ షా ముందు మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు. ఈ రకంగా ఎవరూ మాట్లాడలేదని కిషన్ రెడ్డి తనతో చేసిన వ్యాఖ్యల గురించి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బీజేపీలో ఉన్న సమయంలో 35 ఎంఎం సినిమా చూపించామన్నారు. ఇక ఆ సినిమా అయిపోయిందన్నారు.
ఇక 70 ఎంఎం సినిమా చూపిస్తానని ఆయన చెప్పారు. మునుగోడులో బీజేపీని 12 వేల నుండి 87 వేలకు తీసుకువచ్చింది కూడ ఎవరూ లేరన్నారు. మునుగోడు ప్రజల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చినట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. రాష్ట్రంలో 90 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హయంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ నేతల మధ్య ఏమైనా సమస్యలుంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుందామని ఆయన కోరారు. బహిరంగంగా గొడవలు పెట్టుకోవద్దని ఆయన పార్టీ క్యాడర్ కు సూచించారు. చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డిలు కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ చేర్చుకున్నాడన్నారు. అయితే బీఆర్ఎస్ కు చెందిన వీరేశాన్ని కాంగ్రెస్ లో చేర్చుకొని టిక్కెట్టు ఇచ్చిన విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. టిక్కెట్ల కేటాయింపులో పార్టీ అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు.
also read:బీజేపీకి గుడ్‌బై: కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
2018 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2022 ఆగస్టులో కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అదే ఏడాది అక్టోబర్ మాసంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గత మాసంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
మునుగోడు నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించిన చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు.