తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే.. ఇప్పటికే రాష్ట్రంలోని సీపీఎం, సీపీఐ ముఖ్య నేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సీపీఐ నేతలతో ఠాక్రేతో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో పొత్తులపై చర్చ జరిగిందని.. సీపీఐ నాలుగు స్థానాలు కోరిందని తెలుస్తోంది. ఇందులో మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడం, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.
అయితే కాంగ్రెస్ మాత్రం మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అయితే దీనిపై పార్టీలో చర్చించి సమాధానం చెబుతామని సీపీఐ నేతలు.. ఠాక్రేకు చెప్పినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు సీపీఎంతో కూడా పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశమైంది. రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరి, రాజకీయ ఎత్తుగడలు, తదితర అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర కమిటీ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కూడా హాజరయ్యారు.
ఇక, మునుగోడు ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌తో జట్టు కట్టిన వామపక్షాలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో కలిసి ముందుకు సాగాలని భావించారు. అయితే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటికే ఏకపక్షంగా 115 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వామపక్షాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై కూడా వారు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడమా?, కలిసివచ్చే పార్టీలతో ముందుకు సాగడమా? అనే డైలామాలో ఆ పార్టీలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
