హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కి మద్దతిచ్చే విషయమై తేల్చేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ చెప్పారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలని టీజేఎస్ తమను కోరిందన్నారు. తమ పార్టీకి చెందిన నేతలు టీజేఎస్ కు మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారని  పార్టీ నేతలు చెప్పారు.

also read:కోదండరామ్‌కి షాక్: ఠాగూర్ కి కాంగ్రెస్ నేతల మొర

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో మాణికం ఠాగూర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కోదండరామ్ కి మద్దతివ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుండే నేతలను బరిలోకి దింపాలని కోరారు.

ఈ విషయమై ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు గాను పార్టీ నేతలతో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఠాగూర్ ప్రకటించారు. ఫ్రెండ్లీ పార్టీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.  పీసీసీ మార్పు విషయమై తాను మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ మార్పు అనేది పార్టీ అంతర్గత విషయమన్నారు. 

పీసీసీ మార్పు ఏఐసీసీ అధ్యక్షురాలు పరిధి అంశంగా ఆయన చెప్పారు.పీసీసీ విషయంలో అధిష్టానం తనకు ఏమీ చెప్పలేదన్నారు. 2023 అధికారంలోకి రావాలన్నదే అధిష్టానం ఆదేశమని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. సీఎం అభ్యర్ధిని ముందుగా ప్రకటించడం ముఖ్యం కాదు... గెలుపే ముఖ్యమని ఠాగూరు అభిప్రాయపడ్డారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు.

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గవర్నర్ ను కలవాలని భావించామన్నారు. తమకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.