హైదరాబాద్:  2023 ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తే విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ ధీమాను వ్యక్తం చేశారు.పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా నియమాకమైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో ఠాగూర్ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన  ప్రసంగించారు.

తెలంగాణలో బలమైన కాంగ్రెస్ పార్టీ నేతలున్నారని ఆయన చెప్పారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్, ధోని మాదిరిగానే తెలంగాణలో గట్టి నేతలున్నారన్నారు. క్రికెట్‌లో ఒక్కరో ఇద్దరో కష్టపడితే గెలవమన్నారు. కలిసికట్టుగా కష్టపడితే విజయం సాధిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియాగాంధీకి బహుమతిని ఇవ్వాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతలంతా క్రమశిక్షణగా మెలగాలని ఆయన కోరారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరించొద్దని ఆయన నేతలను కోరారు.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైద్రాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి పార్టీ నేతలతో ఆయన చర్చించారు. రెండు గంటల పాటు ఆయన పార్టీ నేతలతో చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న కుంతియాను తప్పించి మాణికం ఠాగూర్ ను తెలంగాణ ఇంచార్జీగా కాంగ్రెస్ పార్టీ నియమించింది.