టీ కాంగ్రెస్‌లో తుఫాన్.. మంగళవారం మరోసారి సీనియర్ నేతల భేటీ.. అదే రోజు అజెండా ఖరారు..!
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల నియమాకంతో చెలరేగిన చిచ్చు మరింతగా ముదిరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల నియమాకంతో చెలరేగిన చిచ్చు మరింతగా ముదిరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు. అసలు కాంగ్రెస్ నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతుందనే వాదన వినిపించారు. దీంతో వలస వచ్చిన నాయకులు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా పరిస్థితి మారిందనే చెప్పాలి. ఇందుకు శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశం వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కిలతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనపై కామెంట్స్ చేశారు.
అలాగే ఈ సమావేశంలో పీసీసీ నిర్వహించే ఏ సమావేశానికి కూడా హాజరు కాకూడదని నేతలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఏఐసీసీ కార్యక్రమాల అమలుపై పీసీసీ సమావేశం పెట్టిన బహిష్కరిచాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. అలాగే మంగళవారం మరోసారి సమావేశం కావాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను భాగస్వామ్యం చేయాలనే వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మంగళవారం జరిగే సమావేశంలో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు వారి అజెండాను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు భట్టి నివాసంలో జరిగిన సమావేశం అనంతరం నేతలు మాట్లాడుతూ.. ఒర్జినల్ కాంగ్రెస్ నినాదంతో.. వలస వచ్చిన నేతల వల్ల పార్టీ నమ్ముకున్న వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉమ్మడి గళం వినిపించారు. టీపీసీసీ కమిటీల్లో బయటి నుంచి వచ్చినవారికే.. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ పదవులు దక్కాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ.. వలస నాయకుడు, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉద్దరిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు.
సోషల్ మీడియా పోస్టులతో కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న నాయకులపై కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, కాంగ్రెస్‌లోనే ఉన్నామని, కాంగ్రెస్‌లోనే చస్తామని నేతలు స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్‌వాదులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని.. అందుకే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించారు.