హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. 

సుమారు గంటన్నరపాటు పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు వి.హనుమంతరావు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నిరసనలకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను కోరారు.  

యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోపించారు. యురేనియం శుద్ధి చేయగా వచ్చిన వ్యర్ధాలు కృష్ణా నదిలో కలవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతారని తెలిపారు. 

కిడ్నీ, క్యాన్సర్ వ్యాధులతో పాటు పిల్లలు మానసిక రోగులుగా మారుతారని స్పష్టం చేశారు. నల్లమలలో జీవవైవిధ్యం దెబ్బతింటుందన్నారు. జంతువులు మృత్యువాత పడతాయని చెప్పుకొచ్చారు. చెంచుల జీవితాలు అస్తవ్యస్థం మారతాయన్నారు. 

యురేనియం తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో పంటలు పండకపోగా అక్కడ నీళ్లు వ్యవసాయం సాగుకు పనికిరావని తెలిపారు. భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. కడప, జార్ఖండ్ ప్రాంతాల్లో ఇలానే జరిగిందని స్పష్టటం చేశారు. 

ప్రజా సమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పుకొచ్చారు. అందుకే తాను ముందుగా ఆయన్ను కలసి పోరాటానికి మద్దతు కోరినట్లు వీహెచ్ తెలిపారు. తన విన్నపంపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. 

అఖిలపక్షం పిలుద్దాం, నిపుణులతో మాట్లాడి జరగబోయే నష్టాలను ప్రజలకు వివరిద్దాం అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీహెచ్ తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఎక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలి అనే అశంపై వివరిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని వీహెచ్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కళ్యాణ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీ

యురేనియం తవ్వకాలు తెలుగు రాష్ట్రాలకు ముప్పు: జనసేనాని పవన్ కళ్యాణ్