కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆయన నేతలతో భేటీ కానున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా వున్న సమస్యలను పరిష్కరించేందుకు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. రేపు ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో డిగ్గీ రాజా భేటీ కానున్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
కాగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి జోరు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో సక్సెస్ ఫుల్ గా అధికారాన్ని చేజిక్కించుకుని ఊపుమీదున్న కాంగ్రెస్ తెలంగాణపై కన్నేసింది. తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా రెండుసార్లు గెలిచిన బిఆర్ఎస్ ను ఈసారి ఎలాగయినా ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్... హైదరాబాద్ లో సిడబ్ల్యూసి భేటీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్యూసి) మొదటి సమావేశం నిర్వహించాలని ఏఐసిసి నిర్ణయించింది. సెప్టెంబర్ 16న ఈ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీకోసం కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తో పాటు జాతీయస్థాయి కీలక నాయకులు హైదరాబాద్ రానున్నారు. ఈ భేటీలో పాల్గొనే నాయకులతో భారీ బహిరంగ సభకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభ ద్వారా ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే మరో మూడు రాష్ట్రాలు చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ బలంగా వుంది. చత్తీస్ ఘడ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ అధికారంలో వుంది. మధ్య ప్రదేశ్ లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ విజయం సాధించి లోక్ సభ ఎన్నికలకు తాము సిద్దమేనని ఘనంగా ప్రకటించాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బలంగా వున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది.
