Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి వర్గానికి జైపాల్ అభయ హస్తం

  • టిడిపి, టిఆర్ఎస్ పొత్తు ఖరారైతే రేవంత్ ఆప్షన్ కాంగ్రెస్సేనా?
  • జైపాల్ తో టచ్ లో ఉన్న రేవంత్ వర్గం
  • కేసిఆర్ పొడగిట్టని వారంతా రేవంత్ తోనే
Congress rolls out red carpet to TDPs Revanth faction through Jaipal

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. రాజకీయ సమీకరణాలు గంట గంటకూ మారిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిన్నర కూడా లేకపోవడం మరోవైపు ఏడాదిలోపే జమిలీ ఎన్నికలు ముంచుకొచ్చే ప్రమాదం ఉండడంతో ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. పార్టీలు, నాయకులు అందరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఏ పార్టీలో ఉంటే గెలుస్తాము? ఏ పార్టీ అధికారంలోకి వస్తది? ఏ ఏ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి. పొత్తులుంటే మనకు సీటొస్తదా రాదా? ఈ రకమైన అంచనాల్లో మునిగిపోయారు నాయకులు.

ఒకవైపు తెలంగాణలో టిడిపి, టిఆర్ఎస్ పొత్తుల దిశగా అడుగులేస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పొత్తులపై రెండు పార్టీల కేడర్ లో అయోమయం నెలకొన్నది. గడచిన మూడేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ మీద స్ట్రాంగ్ ఫైట్ చేసింది. కానీ కేసిఆర్ చాతుర్యంతో టిడిపి పొత్తుకు సై అనక తప్పని వాతావరణం నెలకొన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ పొడ అంటేనే గిట్టని నేతలు టిడిపిలో చాలా మంది ఉన్నారు. అలాంటి నాయకులందరిలో రేవంత్ ముందు వరుసలో ఉంటాడు. కేసిఆర్ తో అలాంటి తీవ్రమైన వైరం పెంచుకుని ఉన్నారు రేవంత్. మరి పొత్తులు టిడిపి, టిఆర్ఎఎస్ మధ్య ఉంటే రేవంత్ తో పాటు కేసిఆర్ పొడ గిట్టని నాయకులు టిడిపిని వీడియ బయటకు పోవడం ఖాయంగా చెబుతున్నారు. మరి కేసిఆర్ పొడ గిట్టని రేవంత్ అండ్ కో ఎటు పోతారు? వారి భవిష్యత్తు ఏమిటన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజా విశ్వసనీయ సమాచారం మేరకు టిడిపి, టిఆర్ఎస్ పొత్తంటూ జరిగితే రేవంత్ అండ్ టీం కచ్చితంగా టిడిపికి గుడ్ బై చెప్పడం ఖాయమంటున్నారు. ఆరు నూరైనా కేసిఆర్ ను 2019లో గద్దె దింపడమే లక్ష్యంగా రేవంత్ పనిచేస్తున్నారు. దానికోసం ఎవరితోనైనా కలుస్తామంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు. ఈ విషయంలోనే రేవంత్ తన మామ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జైపాల్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ తోపాటు ఆయన లాంటి (కేసిఆర్ కు బద్ధ వ్యతిరేకులు) వారికి కాంగ్రెస్ లో టికెట్లు ఖాయమన్న సంకేతాలు జైపాల్ నుంచి అందినట్లు చెబుతున్నారు.

టిడిపి, టిఆర్ఎస్ పొత్తు ఖాయమైన వాతావరణం ఉంది కాబట్టి మీరంతా అక్కడ ఉండకుండా కాంగ్రస్ లోకి రండి అని జైపాల్ రెడ్డి టిడిపి నేతలను కోరినట్లు తెలిసింది.ఇంకోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి టచ్ లోకి వచ్చిందని, రేవంత్ కు పార్టీలో కీలక పదవులు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామన్న సంకేతాలిచ్చినట్లు కూడా చర్చల్లో నానుతున్నది. అయితే తెలంగాణ నేతలు టిడిపిని వీడతారన్న సంకేతాలు మాత్రం ఇటీవల జరిగిన సమావేశంలో గట్టిగానే చంద్రబాబుకు పంపించారు కొందరు నేతలు. ఎపి రాజకీయ నాయకులు కేసిఆర్ తో రాసుకొని, పూసుకొని తిరగడాన్ని ఉదహరిస్తూ పొత్తులకు ఈ చేష్టలు సంకేతాలు కావా అన్నట్లు ప్రశ్నించారు తెలంగాణ నేతలు. అయితే నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు చంద్రబాబు. ఎపి నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో కథనాలొచ్చాయి. అయితే ఆమాత్రం ప్రకటన పట్ల తెలంగాణలోని కేసిఆర్ వ్యతిరేక టిడిపి నేతలు సంతృస్తి వ్యక్తం చేయడంలేదు. టిఆర్ఎస్ తో పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదు అన్న సంకేతాలు, స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమన్న హెచ్చరికలు పంపారు.

ప్రస్తుతం ఎపిలో అధికారం నిలబెట్టుకోవడం, తెలంగాణలో ఉన్న పార్టీని కాపాడుకోవడం అనే రెండు లక్ష్యాలు చంద్రబాబు ముందుండే అవకాశం ఉంది. దీంతోపాటు ఎపి టిడిపి నేతలందరికీ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా ఉన్నాయి. ఎపిలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడంతోపాటు తెలంగాణలో ఉన్న ఆస్తుల పరిరక్షణ కూడా ముఖ్యమైన అంశం కాబట్టి అనివార్యంగా ఇక్కడ టిఆర్ఎస్ తో పొత్తు ఉండొచ్చు అన్న గుసగుసలు కూడా పార్టీ  నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వచ్చే జనవరి నెలాఖరు నాటికి తెలంగాణ టిడిపి నేతలు సైకిల్ వదిలేసి హస్తం పార్టీకి జంప్ కావొచ్చని రాజకీయ వర్గాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/dKBKp6

 

Follow Us:
Download App:
  • android
  • ios