75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీల వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం : కేటీఆర్
KTR: కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Telangana Assembly Elections 2023: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారతదేశంలో బీసీల అభివృద్ధి జరగకపోవడానికి కాంగ్రెస్సే కారణమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ను ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలను ప్రజలు ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై విమర్శల దాడిచేశారు. సీఎం కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలను ఖండించిన మంత్రి కేటీఆర్.. రెండు రాష్ట్రాల్లోని అభివృద్ధి, విద్యుత్తు సరఫరా వంటి పలు అంశాలను పోలుస్తూ విమర్శలు గుప్పించారు. 'కర్ణాటకలో మీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్ కొనసాగితే.. తెలంగాణలో మాది 24 గంటల.. పవర్ ఫుల్ మోడల్ ఉందని' అన్నారు.
అలాగే, పదేళ్ల ప్రస్థానం తరువాత కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన తమదని తెలిపారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కర్నాటక కాంగ్రెస్ సర్కారుదని విమర్శించారు. ''మీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలకు పాతరేసి, నమ్మి ఓటేసిన ఆ ప్రజలను పూర్తిగా గాలికొదిలేసి, ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి
ఇది అమాయక కర్ణాటక కాదు.. తెలివైన తెలంగాణ..'' అని పేర్కొన్నారు. రైతులకు ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని కర్నాటక కాంగ్రెస్.. రాష్ట్ర ప్రజలకిచ్చిన ఐదు హామీల్ని ఐదేళ్లయినా అమలుచేయలేరని వ్యాఖ్యానించారు. ''మీ రాష్ట్రంలో కనీసం రేషన్ ఇవ్వలేరు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరు.. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే..'' అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు జరిగితే హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనీ, ఇది తథ్యమని పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు.