దేవరకద్ర కాంగ్రెస్ బరిలో జిఎంఆర్? ప్రకటనే ఆలస్యం అంటున్న అనుచరులు
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా త్వరలోనే విడుదలకానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ జాబితాలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన జి మధుసూదన్ రెడ్డి పేరు వుంటుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్ నగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్ని స్పీడ్ పెంచాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గ స్థాయిలో ప్రచారం కూడా ప్రారంభించింది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే వున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇలా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డికి దేవరకద్ర టికెట్ ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ ప్రకటించినున్న అభ్యర్థుల జాబితాలో జిఎంఆర్ పేరు వుంటుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి టిపిసిపి చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున నిరసనలు, ఆందోళనలు చేపట్టిన జిఎంఆర్ టిపిసిసి, ఏఐసిసి దృష్టిలో పడ్డారు. ఇలా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఆయనను అసెంబ్లీకి పంపించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
రాజకీయ నాయకుడిగానే కాదు న్యాయవాదిగా కూడా జిఎంఆర్ కు మంచి గుర్తింపు వుంది. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అతడు అంచెలంచెలుగా పైకి వచ్చారు. తన అనుచరులు, కార్యకర్తల భాగోగులు చూసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసేలా చేస్తున్నారు మధుసూదన్. ఇలా తన పనితీరుతో రేవంత్ కు దగ్గరైన జిఎంఆర్ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు.
Read More కంటోన్మెంట్ లో వారసురాళ్లదే హవా.. అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్న నాయకుల కూతుర్లు
రాజకీయంగా, ఆర్థికంగా బలంగా వున్నమధూసూదన్ రెడ్డి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తాడని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. స్థానికుడైన ఆయనకే దేవరకద్ర టికెట్ కేటాయించి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రేవంత్ తో పాటు ఏఐసిసి భావిస్తోందట. అలాగే పార్టీ సర్వేల్లోనూ జిఎంఆర్ కే దేవరకద్ర ప్రజల మద్దతు తెలిపారట. దీంతో మధుసూదన్ రెడ్డి ఈసారి బరిలోకి దిగడం ఖాయమేనని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.