కంటోన్మెంట్ లో వారసురాళ్లదే హవా.. అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్న నాయకుల కూతుర్లు
కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని దివంగత, మాజీ నాయకుల కూతుర్లు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీలు కూడా అక్కడ మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అక్కడ మహిళా అభ్యర్థికి టికెట్ కేటాయించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ దాదాపు తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ తొందరలోనే మొదటి లిస్టును విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పలు నియోజకవర్గాల్లో మహిళకే అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గం కూడా ఉంది.
ఇప్పటికే బీఆర్ఎస్ ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత నాయకుడు సాయన్న కూతురు లాస్యకు టికెట్ ఖరారు చేసింది. సాయన్న హఠాన్మరణం చెందటంతో పార్టీ ఆమెకే టికెట్ కేటాయించింది. అయితే అదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసిన నాయకుల కూతుర్లు కూడా వివిధ పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆ పార్టీలు కూడా కంటోన్మెంట్ నుంచి మహిళలకే ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాయి.
ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన శంకర్‌రావు కూతురు సుష్మితకు టికెట్ ఇవ్వాలని బీజేపీ అనుకుంటోందని తెలుస్తోంది. ఆమెకు టికెట్ ఇచ్చి తీరాల్సిందే అని ఆ పార్టీ నేత వివేక్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆయనకు అధిష్టానంపై కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనను శాంతింపజేయడానికి ఆ పార్టీ సుష్మితకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే స్థానం నుంచి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉద్యోగి పరశురామ్, ఆర్ఎస్ఎస్ సపోర్టు ఉన్న కపిల్ బరాబరి బీజేపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ కూడా గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ స్థానం నుంచి టికెట్ ఇవ్వాలని చూస్తోంది. గద్దర్ కుటుంబం ప్రస్తుతం కంటోన్మెంట్ దగ్గరలోనే నివసిస్తోంది. అయితే అదే పార్టీ నుంచి స్థానిక నేతలైన డీబీ దేవేందర్, నర్సింహలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. పొంగులేటి సన్నిహితుడు పిడమర్తి కూడా టికెట్ కోరుతున్నారు. అలాగే అల్వాల్ మున్సిపాలిటీకీ గతంలో చైర్మన్ గా పని చేసిన జీవక కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.
వీరితో పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన సర్వే సత్యనారాయణ కూడా తనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. ఈ మేరకు గతంలో గాంధీ భవన్ లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ తరువాత సత్యనారాయణ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే అనేక సమీకరణల దృష్యా కాంగ్రెస్ గద్దర్ కూతురు వెన్నెలకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.