తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. ములుగు నుంచి ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది . మూడు విడతల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని థాక్రే తెలిపారు.

congress ready for bus yatra ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. మూడు విడతల్లో బస్సు యాత్రలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.  18 నుంచి తొలి దశ.. దసరా తర్వాత రెండో దశ.. నామినేషన్ల ప్రక్రియ తర్వాత మూడో దశ యాత్ర జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే వెల్లడించారు. 

18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని థాక్రే తెలిపారు. ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని.. ఆ తర్వాత పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ వుంటుందని ఆయన వెల్లడించారు. అనంతరం కరీంనగర్‌లో పాదయాత్ర, బహిరంగ సభ వుంటాయని , జగిత్యాలలో రైతులతో రాహుల్ సంభాషిస్తారని థాక్రే చెప్పారు. నిజామాబాద్‌లో పాదయాత్ర , బహిరంగ సభ.. ఆర్మూర్‌లో రైతులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారని మాణిక్ రావు థాక్రే చెప్పారు. 

Also Read: కేసీఆర్‌కు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది .. మా పథకాలు కాపీ కొట్టి మేనిఫెస్టో , ఇక తప్పుకుంటే బెటర్ : రేవంత్

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి కేసీఆర్ హామీలను ప్రకటించారని ఆరోపించారు. సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చాక కేసీఆర్ కనిపించకుండా పోయారని, చలి జ్వరం వచ్చిందని కేటీఆర్ చెప్పారని రేవంత్ చురకలంటించారు. మా మేనిఫెస్టోతో ఆగం అవుతారని అన్నారని.. మరి ఇప్పుడేం అంటారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తాము మహాలక్ష్మీ అంటే కేసీఆర్ సౌభాగ్యలక్ష్మీ అన్నారని.. తాము సిలిండర్ 500 అంటే, కేసీఆర్ 400 అన్నాడని దుయ్యబట్టారు. నిధులు లేవు , నిధులు సరిపోవు అన్న మాట ఉత్తదేనని రేవంత్ వ్యాఖ్యానించారు. సారా వేలం పాటలో పోటీ జరిగినట్లు మమ్మల్ని కాపీ కొట్టాడని.. సోనియా గాంధీ ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలవుతాయని కేసీఆరే నిరూపించారని ఆయన చురకలంటించారు. 

కేసీఆర్ స్వయంప్రకాశి కాదు.. పరాన్నజీవి అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ ఆలోచన సామర్ధ్యం కోల్పోయారని.. కేసీఆర్‌ను ఇండియా కూటమి మెడపట్టి గెంటేసిందని ఎద్దేవా చేశారు. తాము రూ.4 వేల పెన్షన్ ఇస్తామంటే, ఎలా సాధ్యమని ప్రశ్నించారని.. మరి మీరు ఎలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హామీ ఇస్తే అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కర్నాటకలో డబ్బులు పట్టుకుంటే మాకేం సంబంధమని రేవంత్ నిలదీశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios