తెలంగాణా వచ్చాక ఉద్యోగావకాశాలు రాక అసంతృప్తితో ఉన్న యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని వచ్చే ఎన్నికల హామీగా కాంగ్రెస్ ఇపుడే ప్రకటించింది.

తెలంగాణా వస్తే ఉద్యోగం వస్తుందని కలలు కన్న విద్యార్థులకు, తెలంగాణా వస్తే ప్రయోజనం ఉంటుందని ఆశించి భంగపడిన రైతులకు, ప్రత్యేక రాష్ట్రంలో కాసింత గూడు దొరుకుతుందని ఎదురుచూసిన పేదలకు... కాంగ్రెస్ ప్రత్యేక వరాలు ప్రకటించిది.
ఈ మూడు సమస్యల మీద ఈ పార్టీ వచ్చే ఎన్నికలకు వెళ్లనుంది. ఈ విషయాలను అంబేద్కర్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ నిర్వహించిన బడుగు, బలహీన వర్గాల గర్జన సభలో పార్గీ నేతలు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, అన్ని విధాలుగా విద్యార్థులు నష్టపోయారని, తీరా రాష్ట్రం వచ్చాక వారు వంచనకు గురయ్యారని పార్టీ చెప్పింది. అందువల్ల నిరుద్యోగులు, యువకులు ఇపుడు సంక్షోభంలో ఉన్నారని అంటూ వారిని ఆదుకునేందుకు నెలనెలా నిరుద్యోగ భృతిని ఇస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులు కూడా బాగా మోసపోయారని, వచ్చే సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
మూడో హామీ ఇళ్లకోసం. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు టిఆర్ ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారిని ఆదుకుంటామని హామీ ఇస్తూ ఇప్పటికే నిర్మించిన ఇందిర మ్మ ఇళ్లకు అదనంగా మరో గదిని ఉచితంగా నిర్మిస్తామని చెప్పారు.
ఈ సభలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జన ఖర్గే, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో పార్టీ తెలంగాణా సీనియర్ నేతలంతా పాల్గొన్నారు.
