హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలే ప్రధానంగా చర్చకు వచ్చేలా కనిపిస్తున్నాయి. రెండు వారాల పాటు జరిగే సమావేశాల్లో  విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ రైతు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకుంది. 

అధికార పార్టీ కూడా  కాంగ్రెస్ పార్టీ నేతలకు కౌంటర్లు ఇవ్వడానికి సన్నద్దమైంది.రైతు సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చిత్త శుద్దిగా ఉందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.

డీసీసీబీ,డీసీఎంఎస్ ఛైర్మెన్ లతో భేటీ అయిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు..రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతు సమస్యలు తెలుసని, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

 కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో టీఆరెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గతంలో ఉన్న రాయితీలు అందడం లేదని చెబుతోంది.రైతుబంధు పథకం అమలవుతున్నా....59 యేళ్ళు దాటిన రైతులకు అమలు కాకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

 రైతు రుణమాఫీ కి సంబంధించి ప్రభుత్వం  ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి  ఏడాదిన్నర అవుతున్నా  ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

 బడ్జెట్ సమావేశాల్లో ఈ అన్ని అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు  కాంగ్రెస్ పార్టీ  దృష్టి సారించింది. ఇప్పటికే కిసాన్ సెల్ ఆధ్వర్యంలో పలు సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది.