హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కోరారు. అయితే ఈ విషయమై కేసీఆర్‌తో చర్చించాలని ఆయన సూచించారు.

శనివారం నాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని  కాంగ్రెస్ పార్టీ నేతలతో కేటీఆర్ చర్చించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం తాము మద్దతిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఈ ఏడాది మార్చి 12వ తేదీన జరిగే  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తాము పోటీ చేసే అభ్యర్ధికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలతో పాటు  టీడీపీ నుండి పోటీ చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో తాము ఎమ్మెల్సీని కైవసం చేసుకొంటామని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

అధికార టీఆర్ఎస్ నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. మరో సీటులో మిత్రపక్షమైన ఎంఐఎంకు మద్దతు ఇచ్చింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి.  మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ చర్చించనున్నారు. పార్టీ ముఖ్యులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నాడు చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవికి పద్మారావు ఎన్నిక లాంఛనమే

నా నెంబర్ బ్లాక్, నేను చేయగలనా: కేటీఆర్, ఉత్తమ్‌ మధ్య ఆసక్తికరం

కారణమిదే: సీఎల్పీ నేత భట్టితో కేటీఆర్ భేటీ (వీడియో)