హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయమై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో శనివారం నాడు చర్చించారు.

శనివారం నాడు సీఎల్పీ సమావేశ మందిరంలో భట్టి విక్రమార్కతో  డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయమై చర్చించినట్టు సమాచారం.నిన్ననే ఈ విషయమై అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు. తమ పార్టీ వైఖరిని  ఇవాళ చెబుతామని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.

ఈ తరుణంలోనే భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో తాము ప్రతిపాదించే అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని కేటీఆర్ భట్టి విక్రమార్కతో చర్చించినట్టు సమాచారం.

అయితే ఈ విషయమై టీపీసీసీ చీఫ్  ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాత తమ పార్టీ నిర్ణయాన్ని చెబుతామన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి 12వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపే అభ్యర్థి గెలుపుకు సహకరిస్తే డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా తాము సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ నుండి నుండి కేటీఆర్‌కు సమాచారం ఇచ్చినట్టు సమాచారం అందుతోంది.ఇదిలా ఉంటే  డిప్యూటీ స్పీకర్‌గా మాజీ మంత్రి  పద్మారావు గౌడ్‌ పేరును కేసీఆర్ ప్రతిపాదించినట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

                                        "