హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మారాడు. తమిళనాడుకు చెందిన ఎంపీ మాణకం ఠాగూర్ ను నియమించారు. కొత్త ఇంచార్జీ రావడంతో పీసీసీ చీఫ్ పదవిపై మళ్ళీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ నేతలు మళ్లీ తమ ప్రయత్నాలను ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

సీడబ్ల్యూసీ పునర్వవ్యస్థీకరించిన తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని మార్చే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం ఎప్పుడో ముగిసింది. అయితే పలు కారణాలతో ఆయనను పార్టీ నాయకత్వం ఇంకా కొనసాగిస్తోంది.

పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు నేతలు తమ ప్రయత్నాలను తిరిగి ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ నెలకొన్నట్టుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వవద్దని కొందరు పార్టీ సీనియర్లు నాయకత్వానికి తేల్చి చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

రేవంత్ కి కాకుండా తమలో ఎవరికైనా పార్టీ పదవిని ఇవ్వాలని కూడ పార్టీ నేతలు కొందరు చెప్పారని గతంలో ప్రచారం సాగింది.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్లశ్రీధర్ బాబు, .జానారెడ్డి, హనుమంతరావు తదితరులు కూడ పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడుతున్నారు.

అందరికీ ఆమోదయోగ్యమైన పేరుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరును పార్టీ నేతలంతా సూచిస్తున్నారని సమాచారం. శ్రీధర్ బాబు ఈ పదవిని తీసుకొనేందుకు ఆసక్తిని చూపకపోతే జానారెడ్డి వైపు కూడ అధిష్టానం ఆసక్తిని కనబర్చిందని చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెడతారని ప్రచారం కూడ పెద్ద ఎత్తున సాగుతోంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రేవంత్ రెడ్డి తీసుకొంటున్న కొన్ని నిర్ణయాల పట్ల పార్టీలోని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. బహిరంగంగానే రేవంత్ తీరుపై విమర్శలు చేశారు.

also read:ఎఐసీసీలో పరిణామాలు: మరో ఆర్నెళ్లు ఉత్తమ్‌కు ఢోకా లేదా?

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకుండా బీసీ వర్గానికి చెందిన వారికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టాలని కొందరు నేతలు కోరుతున్నారు. బీసీలకు పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వాలని వీహెచ్ పదే పదే కోరుతున్నారు. 

ఈ విషయమై తన వాదనను సోనియాగాంధీకి విన్పించాలని ఆయన భావిస్తున్నారు. కానీ సోనియా అపాయింట్ మెంట్ ఆయనకు దక్కలేదు.రాష్ట్ర పార్టీ ఇంఛార్జీగా నియమితులైన ఠాగూర్ త్వరలోనే రాష్ట్రానికి చెందిన నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు.