హైదరాబాద్: ఎఐసీసీలో చోటు చేసుకొన్న పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసొచ్చాయి. మరో ఆరు మాసాల పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా కొనసాగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిసింది. కానీ తన స్థానంలో ఇతరులను నియమించాలని పార్టీ అధిష్టానానికి లేఖ కూడ రాశారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొందరి పేర్లను పరిశీలించింది.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిందనే ప్రచారం సాగింది. అయితే ఈ తరుణంలో కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ ను పీసీసీ చీఫ్ గా నియమించవద్దని పార్టీ అధిష్టానానికి తెగేసీ చెప్పినట్టుగా సమాచారం. మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నేతలు కోరడంతో  కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఆలస్యమైంది.

ఈ సమయంలో ఎఐసీసీలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. పార్టీ అధినేత సోనియా గాంధీకి 23 మంది సీనియర్లు లేఖ రాయడం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకొంటానని సోనియా ప్రకటించిన విసయం తెలిసిందే. అయితే సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేవరకు సోనియానే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని సీడబ్యూసీ ఈ నెల 24వ తేదీన  తీర్మానం చేసింది.

ఈ పరిణామాలన్నీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసొచ్చినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎఐసీసీకి కొత్త చీఫ్ వచ్చే వరకు  ఉత్తమ్ పదవికి ఢోకా ఉండకపోవచ్చని అభిప్రాయంతో ఉన్నారు.

పీసీసీని ప్రక్షాళన చేయాలని కూడ కొందరు నేతలు చాలా కాలంగా కోరుతున్నారు. అయితే ఎఐసీసీకి కొత్త చీఫ్ వచ్చిన తర్వాతే పీసీసీకి కొత్త చీఫ్ తో పాటు పీసీసీ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.సోనియాగాంధీ ఎఐసీసీ చీఫ్ గా ఉన్నంత కాలం ఉత్తమ్ కు ఢోకా ఉండదని పార్టీ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.