తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి కి సొంత పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకులు షాకిచ్చారు. 

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలాకాలోనే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడారు. జవహర్ నగర్ కు చెందిన నలుగురు కార్పోరేటర్లు, తూముకుంటకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, ఘట్కేసర్ కు చెందిన ఒక కౌన్సిలర్, నలుగురు ఎంపీటిసిలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వీరు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. 

ఇదిలావుంటే హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా కనిపిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ప్రచారం సాగింది. ఈటల బిజెపి తరఫున పోటీకి సిద్దమవగా ఆయనను ఎలాగయినా ఓడించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని పోటీ చేయించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

read more నేనే టీఆర్ఎస్ అభ్యర్థిని...: కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ ఆడియో లీక్

ఇదే జరిగితే టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ కు మరో షాక్ తగలనుంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులను రేవంత్ కు దూరం చేయడానికి టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేలా చేశారు.