Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపండి.. పార్లమెంట్‌ వేదికగా ఎంపీ ఉత్తమ్ డిమాండ్..

తెలంగాణలోని బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ  ఎన్ ఉత్తమ్ కుమార్ పార్లమెంట్ వేదికగా గళం వినిపించారు. వాటిని ప్రభుత్వ సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Congress MP Uttam Kumar Reddy demands cancelling Singareni coal block auction
Author
First Published Dec 7, 2022, 4:35 PM IST

తెలంగాణలోని బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ  ఎన్ ఉత్తమ్ కుమార్ పార్లమెంట్ వేదికగా గళం వినిపించారు. ఈ రోజు లోక్‌సభలో జీరో అవర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్వహిస్తున్న నాలుగు బొగ్గు గనులను వేలం వేయడాన్ని ప్రస్తావించారు. వాటిని ప్రభుత్వ సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను రద్దు చేసి.. సింగరేణి కాలరీస్‌కు బొగ్గు బ్లాకులను ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య 51:49 జాయింట్ వెంచర్’’ అని ఉత్తమ్ మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని లోక్ సభ దృష్టికి తెచ్చారు.

అయితే ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. బొగ్గు గనుల వేలం పారదర్శకమైన ప్రక్రియ అని అన్నారు. అదే సమయంలో బొగ్గు కుంభకోణం చేసిన వ్యక్తులు.. ఇటువంటి పారదర్శక వ్యవస్థను కోరుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.  ‘‘రెండేళ్లుగా వేలం ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పారదర్శకమైన వ్యవస్థ.. బొగ్గు కుంభకోణం చేసిన వ్యక్తులు ఈ పారదర్శక వ్యవస్థను కోరుకోవడం లేదు’’ అని ప్రహ్లాద్ జోషి చెప్పారు. గనులను వేలం వేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వెళ్తుందని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios