హైదరాబాద్: కుమారుడికి వారసత్వ సంకేతాలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద రైతులపై లేదా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. బుధవారం నాడు నాడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. వరదలతో క్షేత్రస్థాయిలో పంట నష్టం తీవ్రంగా ఉన్నా కూడ అర్ధం కావడం లేదా అని కేసీఆర్ ను ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు.

వరదలతో రాష్ట్రంలో పంటలు , ఆస్తులు కోల్పోయి  ప్రజలు తీవ్ర బాధలో ఉన్నారని ఆయన చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ఎకరానికి రూ. 20 వేల పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఇందుకు కోసం తక్షణమే రూ. 1000 కోట్ల విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పంటలు తిరిగి వేసుకొనేందుకు వీలుగా  విత్తనాలను అందుబాటులో ఉంచాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో సీఎంను కోరారు. వ్యవసాయపొలాల్లో ఇసుక మేట, కోతకు గురైన భూములను చదును చేసుకొనేందుకు ప్రతి ఎకరాకు రూ. 5 వేలు చెల్లించాలని ఆయన కోరారు. 

also read:నాలాల ఆక్రమణలు తొలగింపునకు ప్రజలు సహకరించాలి: కేటీఆర్

పంటల భీమా పథకాన్ని కూడ పునరుద్దరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు బాధిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

వరంగల్ జిల్లాలో వరద ముంపు బాధిత ప్రజలను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్లు ఈ నెల 18వ తేదీన పరామర్శించారు. ఇవాళ్టి నుండి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడ సీఎం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.