వరంగల్: గత ఆరు రోజులుగా కురిసన వర్షాలకు ముంపుకు గురైన హన్మకొండ పట్టణంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ లు మంగళవారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు. 

హైద్రాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ లు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీకి చేరుకొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుండి నేరుగా మంత్రులు హన్మకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

 

హన్మకొండలోని సుమారు 20 కాలనీలు నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. నాలాలు ఆక్రమించుకొని  నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వరంగల్ మేయర్ అభిప్రాయపడ్డారు.

also read:నారాయణపేట జిల్లాలో పుట్టి మునక,ఐదుగురి గల్లంతు

హన్మకొండ పట్టణంలోని నయింనగర్, సమ్మయ్య నగర్ లో ముంపు ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు.కేయూ రోడ్డులోని పెద్దమ్మగడ్డ వద్ద నాలాను పరిశీలించారు.భవిష్యత్తులో ఈ తరహా వరద పోటెత్తకుండా శాశ్వత పరిష్కారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. డ్రైనేజీ నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేశారు. 

ఇండ్లలోకి వరద నీరు చేరిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని మంత్రులు  ఆదేశించారు. ఆక్రమణలకు గురైన నాలాలను తొలగిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.