ఎప్పుడో ఒకప్పుడు నేనూ సీఎం అవుతా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు, తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతానని వ్యాఖ్యానించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . పదవుల మీద తనకు ఆశ లేదని, ఆశ వుంటే ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేసేవాడిని కాదని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు, తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. కానీ బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారని కోమటిరెడ్డి చురకలంటించారు . మన లక్ష్యం సీఎం పదవి కావొద్దని.. పదవుల మీద తనకు ఆశ లేదని, ఆశ వుంటే ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేసేవాడిని కాదని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నదే మన లక్ష్యమని.. బీఆర్ఎస్ ఒక్కో చోట 100 కోట్లు ఖర్చు చేసినా గెలిచేది కాంగ్రెస్ అభ్యర్ధులేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని వెంకట్ రెడ్డి చురకలంటించారు. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నవారికే దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.
ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని లోక్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. తాజాగా ఆ అభిప్రాయాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఆయా పార్టీలకు వచ్చే ఓటు షేర్ ఎంత అనే వివరాలను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే తెలిపింది. అలాగే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని తేల్చి చెప్పింది.
Also Read: లోక్ పోల్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ జోరు.. రెండో స్థానంలో బీఆర్ఎస్, వెనకబడ్డ బీజేపీ..
అయితే ఈ సర్వే బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుంది పేర్కొంది. ఆ పార్టీ 45 నుంచి 51 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని చెప్పింది. అయితే బీజేపీ చివరి స్థానంలో నిలుస్తుందని ఆ సర్వే అంచనా వేసింది. ఆ పార్టీకి 2-3 సీట్లలో మాత్రమే గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం ఎప్పటిలాగే మూడో స్థానంలో నిలిచి, 6 నుంచి 8 సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు. అయితే ఇతరులకు కేవలం 0-1 స్థానాల్లోనే విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది.
ఓట్ షేర్ పరంగా చూస్తే.. కాంగ్రెస్ 41-44 శాతం సాధించి మొదటి స్థానంలో నిలుస్తుందని లోక్ పోల్ సర్వే తెలిపింది. అలాగే అధికార బీఆర్ఎస్ కు కొంత తగ్గుతుందని, ఆ పార్టీ 39-42 శాతం ఓట్లు మాత్రమే పొందుతుందని చెప్పింది. అలాగే ఎంఐఎం 3 నుంచి 4 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుందని తేల్చి చెప్పింది. ఇతరులు కూడా 3 నుంచి 5 శాతం పొందుతారని తెలిపింది.