ఇవాళ 5 గంటలలోపు విధుల్లో చేరకుంటే ఉద్యగాలు పీకెస్తామని సమ్మెలో వున్న జూనియర్ పంచాయితీ కార్యదర్శులను ప్రభుత్వం బెదిరించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పుబట్టారు.  

హైదరాబాద్ : తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన జూనియర్ పంచాయితీ సెక్రటరీలకు ప్రభుత్వం అల్టిమెటం జారీచేయడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయితీ సెక్రటరీలను కాంగ్రెస్ అండగా వుంటుందున్నారు. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 5గంటల లోపు ఉద్యోగాల్లో చేరాలని ... లేదంటే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరించడం దుర్మార్గమని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరడమే జూనియర్ పంచాయితీ కార్యదర్శులు చేసిన నేరమా... రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీకు ఇదే చెప్పారా అంటూ జీవన్ రెడ్డి నిలదీసారు. 

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ఉద్యోగాలు పీకేయడం కాదు ప్రజలే కేసీఆర్ ఉద్యోగాన్ని పీకేయనున్నాడని జీవన్ రెడ్డి అన్నారు. మరో ఐదునెలల్లో మీ ఉద్యోగాలు ఊడటం ఖాయం... ముందు అది చూసుకోండి అంటూ ఎద్దేవా చేసారు. ఇకనైనా ఉద్యోగులను బెదిరించడం మానేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. 

రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ది కోసం పంచాయితీ సెక్రటరీలను నియమించారని... మూడేళ్ల ప్రొహిబిషనరీ తర్వాత క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని జీవన్ రెడ్డి గుర్తుచేసారు. కానీ నాలుగేళ్ళు పూర్తయినా ఇంకా తమను ప్రొహిబిషనరీ ఉద్యోగులుగానే కొనసాగించడంతో జూనియర్ పంచాయితీ సెక్రటరీలు సమ్మెకు దిగినట్లు తెలిపారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీనే వారు నెరవేర్చాలని కోరుతున్నారని అన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చిమరీ ఆందోళనలకు దిగారన్నారు.

Read More కేసీఆర్ సర్కార్ అల్టిమేటం: తగ్గేదేలేదన్న జూనియర్ పంచాయితీ సెక్రటరీలు

జూనియర్ పంచాయితీ సెక్రటరీలు తమకున్న హక్కుతోనే సమ్మె చేస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కానీ వారికి సమ్మెచేసే హక్కే లేదంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దొరలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం కూడా బెదిరింపు దోరణి అవలంబిస్తోందని అన్నారు. తక్షణమే పంచాయితీ సెక్రెటరీలను క్రమబద్దీకరించి వారికి పే స్కేల్ వర్తింపచేయాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 

ఇదిలావుంటే ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో జూనియర్ పంచాయితీ సెక్రటరీలు వెనక్కి తగ్గుతున్నారు. సమ్మె విరమణ దిశగా జేపీఎస్ ఉద్యోగులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మళ్ళీ విధుల్లోకి చేరుతాం అంటూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. విధులను బహిష్కరించి తప్పు చేసామని... మమ్మల్ని క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జూనియర్ పంచాయితీ కార్యదర్శులు కోరుతున్నారు.