2019 నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోవడంపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత గెలిస్తే.. తమపై పెత్తనం చేస్తారనే ఉద్దేశంతోనే ఆమెను ఓడించారంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలన్ని కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా కవితనే టార్గెట్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. 

కవిత గెలిస్తే.. తమపై పెత్తనం చేస్తారనే ఉద్దేశంతోనే ఆమెను ఓడించారంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పసుపు రైతుల చేత నామినేషన్ వేయించింది బీజేపీయేనని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వేయిస్తే బీజేపీలో ఎందుకు చేరుతారని ఆయన ప్రశ్నించారు. కాగా... బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ఇటీవల ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

ALso REad:మాకు డెఫినెట్ గా కవిత ఒడిపోవాలనే ఉంటుంది.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

అంతకుముందు తన ఇంటిపై దాడిపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు సవాల్ విసిరారు. ఇంకా దొరల పాలన సాగుతుందని అనుకొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసి మహిళలను భయపెట్టారని, తన తల్లిని బెదిరించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ లో పోటీచేస్తావా చేయాలని కవితకు అరవింద్ సవాల్ చేశారు. విమర్శలు చేస్తే దాడి చేస్తారా అని అర్వింద్ ప్రశ్నించారు

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పోటీచేసిన 178 మందిలో 71 మంది పసుపు రైతులు బీజేపీలో చేరారన్నారు. తనపై చీటింగ్ కేసు ఏం వేస్తావని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ అని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ పై చీటింగ్ కేసు పెట్టాలని కవితకు సలహా ఇచ్చారు ఎంపీ అర్వింద్. రైతులు గుంపులు గుంపులుగా బీజేపీలో చేరుతున్నారన్నారు. 70 ఏళ్ల వయస్సున్న తన తల్లిని భయపెట్టే హక్కు ఎవరిచ్చారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.