కవిత పీకల్లోతులో కూరుకుపోయింది..: ఈడీ నోటీసులపై జీవన్ రెడ్డి సంచలనం (వీడియో)
తాజాగా డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు జారీచేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడి నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందని... కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఆమెను మరోసారి విచారించడానికి సిద్దమవడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికే ఈ స్కామ్ తో సంబంధాలున్న తోటి నేరస్తులు అప్రూవర్ గా మారారు... కాబట్టి వారిచ్చిన సమాచారంతో మళ్లీ ఈడి కవితను విచారణకు పిలిచినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్ లో కవితకు బినామిగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారాడు. దీంతో మళ్లీ తనకు ఈడి నోటీసులు వస్తాయని కవితకు ముందే తెలుసన్నారు జీవన్ రెడ్డి. అందువల్లే నిన్న(బుధవారం) జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ, రాహుల, సోనియా గాంధీతో పాటు తనపైన విమర్శలు చేసిన కవిత బిజెపి గురించిగానీ... మోదీ,అమిత్ షా గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. మీలా రాహుల్ గాంధీ స్కామ్ లు చేయడంలో అప్డేట్ కాలేడంటూ కవితకు చురకలు అంటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ.
వీడియో
కవిత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం సమంజసం కాదు... అందువల్లే ఎక్కువగా మాట్లాడటం లేదని జీవన్ రెడ్డి అన్నారు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది... డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పీకల్లోతులో కూరుకుపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Read More కవితకు మరోసారి ఈడీ నోటీసులు.. రేపు విచారణకు రావాలని ఆదేశాలు...
ఇదిలావుంటే డిల్లీ లిక్కర్ స్కామ్ లో నిన్నటి(బుధవారం) నుండి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కాంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లై నిన్న అప్రూవర్ గా మారాడు. అతడు కవిత కు బినామీ అన్న ప్రచారం వుంది. అతడు అప్రూవర్ గా మారిన వెంటనే కవిత ఈడీ నోటిసులు జారీచేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే పలుమార్లు కవిత విచారించిన సమయంలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెగ ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. మళ్లీ ఇప్పుడు కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో అరెస్ట్ ప్రచారం మళ్లీ జోరందుకుంది.
రాజకీయంగా కూడా కవితను అరెస్ట్ చేయకపోవడం తెలంగాణ బిజెపిని ఇరకాటంలో పెట్టింది. బిఆర్ఎస్ తో చీకటి ఒప్పందంలో వుందికాబట్టే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కవితను కాపాడుతోందని కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఎన్నికలకు ముందుగానీ... ఎన్నికల తర్వాత గానీ బిజెపి,బిఆర్ఎస్ కలవబోతున్నాయని కాంగ్రెస్ అంటోంది. ఈ ప్రచారాలకు తెరదించేందుకే కవితకు మళ్లీ ఈడీ నోటీసులు జారీచేసారా? ఆమెను అరెస్ట్ చేయనున్నారా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.