కవితకు మరోసారి ఈడీ నోటీసులు.. రేపు విచారణకు రావాలని ఆదేశాలు...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. 
 

ED notices to Kavitha once again, Orders to come for investigation tomorrow - bsb

హైదరాబాద్ : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.  రేపు విచారణకు హాజరుకావాలని కవితకు ఈడి నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 16, 20, 21వ తేదీల్లో ఈడి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించింది. ఆ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ తరువాత ఆరునెలలకు సెప్టెంబర్ లో మళ్లీ ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

గతంలో మూడుసార్లు హాజరైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేపటి పరిస్థితి కూడా ఎలా ఉండబోతోందో చూడాలి. మరి కవిత ఈడీ విచారణకు హాజరవుతుందా? ఏదైనా కారణాలతో వాయిదా కోరుతుందా? అని సందేహాలు వెలువడుతున్నాయి. 

నిన్న కవితకు బినామిగా వ్యవహరించిన రామచంద్ర పిల్లై అప్రూవర్ గా మారాడు. వెంటనే నేడు ఈడీ నోటీసులు కవితకు రావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు శరత్ చంద్రారెడ్డి, మా గుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, రామచంద్ర పిల్లి, బుచ్చిబాబులు అప్రూవర్లుగా మారారు. 

ఈ లిక్కర్ స్కాం కేసులో ఇకపై కవితను విచారించరేమో అనుకున్న ఊహాగానాలకు తెరదించుతూ ఈడి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో కలిసి చేపలపంపిణీ కార్యక్రమంలో ఉన్నారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆమె హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని ఉత్కంఠ నెలకొంది.  

కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటికాదు అనేది చెప్పడానికే ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వచ్చిన తరువాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. దాన్ని మళ్లీ పెంచుకునే క్రమంలోనే ఇది జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios