Asianet News TeluguAsianet News Telugu

పదవుల కోసం రాలేదు .. కాంగ్రెస్ కష్టంలో వున్నప్పుడే పార్టీలో చేరా: సీనియర్లపై సీతక్క ఆగ్రహం

నిఖార్సయిన కాంగ్రెస్ వాదులంతా పార్టీ అధికారంలో వున్నప్పుడు పదవులు అనుభవించి పక్కకు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తాను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తను కాదని.. అందువల్ల తాను సీనియర్ల మీద బహిరంగ విమర్శలు చేయదలచుకోవడం లేదన్నారు. 

congress mla seethakka fires on party senior leaders
Author
First Published Dec 18, 2022, 6:05 PM IST

పదవీ వున్నా లేకున్నా తాము పనిచేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. టీపీసీసీ పదవులకు రాజీనామా చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో నుంచి బయటకు రానోళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, రాహుల్ గాంధీ కూడా ఎంతో శ్రమిస్తున్నారని సీతక్క పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంక్షోభాలు తీసుకురావడం కరెక్ట్ కాదని ఆమె హితవు పలికారు. తమ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే తామే జరగనివ్వమని సీతక్క పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం బాగుందని రాహుల్ కూడా చెప్పారని ఆమె తెలిపారు. తాను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తను కాదని.. అందువల్ల తాను సీనియర్ల మీద బహిరంగ విమర్శలు చేయదలచుకోవడం లేదన్నారు. మా పదవులే వాళ్లకు ఇబ్బంది అయినప్పుడు తమకు అసలు పదవులే వద్దని సీతక్క తేల్చిచెప్పారు. నిఖార్సయిన కాంగ్రెస్ వాదులంతా పార్టీ అధికారంలో వున్నప్పుడు పదవులు అనుభవించి పక్కకు వెళ్లిపోయారని... కానీ తాము కాంగ్రెస్‌లోకి వచ్చాక పార్టీ ప్రతిపక్షంలో వుందన్నారు. 

Also Read:టీ కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు సీతక్క, నరేందర్ రెడ్డి సహా పలువురు రాజీనామా..!

కాగా.. పీసీసీ కమిటీలతో తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన అసమ్మతి రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలువురు సీనియర్ నాయకులు శనివారం ఉమ్మడి గళం వినిపించారు. అసలైన కాంగ్రెస్ వాదులు, వలసవాదులు అనే చర్చను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో పరిస్థితి మరింత దిగజారింది. సీనియర్ నాయకులు చేసిన కామెంట్స్‌తో కలత చెందిన టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 10 మందికి పైగా నేతలు పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు. వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. వారి రాజీనామా లేఖను టీ కాంగ్రెస్ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కు పంపారు. తమ పదవులను పదవులు రానివారికి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 

రాజీనామా చేసినవారిలో వేం నరేందర్ రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారకొండ వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్.. తదితరులు ఉన్నారు. వీరంతా రేవంత్ రెడ్డి వర్గానికే చెందినవారే. తాము భయపెట్టడానికి కాదని.. పదవులు లేకున్నా పార్టీ కోసం పనిచేస్తామని సీతక్క చెప్పారు. పార్టీ మంచి కోసమే రాజీనామా చేస్తున్నామని తెలిపారు.  ఇదిలా ఉంటే.. మరోవైపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీకి శనివారం సీఎల్పీ నేత భట్టి  నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు. 

తీవ్ర అసంతృప్తి.. 
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ నేపథ్యంలో టీడీపీ నుంచి హస్తం పార్టీలో చేరిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము పార్టీలో చేరి చాలా కాలం అవుతుందని.. పార్టీ కోసం పనిచేస్తున్నామని.. అలాంటి తమపై వలవసవాదులు అని ముద్ర వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వలస నేతలు అని కామెంట్ చేయడం పట్ల  వారంతా తీవ్ర మనస్థాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు తమ అసంతృప్తిని రేవంత్ రెడ్డి వద్ద వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సీనియర్ల విమర్శలకు సమాధానంగా.. పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేసినట్టుగా సమాచారం. తాము పదవులను ఆశించడం లేదని.. పార్టీ కోసం పనిచేసేవాళ్లమని వారు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios