ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కలో బళ్లెంలా మారారు. తాజాగా మరోసారి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
KNOW
Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నాయకులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రిపదవి ఆశించి భంగపడ్డ ఆయనతీరు పూర్తిగా మారింది… అవకాశం దొరికితే చాలు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై చేసిన కామెంట్స్ కు ఎక్స్ వేదికన కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారాయన. అవసరం అయితే రాజీనామాకు సిద్దమే అంటూ ప్రకటించారు.
కోమటిరెడ్డి ఏమన్నారంటే..
మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్త చేశారు. పాలకుల తీరు మారకుంటే మరోసారి తాను ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడానికి సిద్దమేనని కోమటిరెడ్డి అన్నారు.
గతంలో తాను రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్లదగ్గరకు వచ్చిందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు కూడా అలా చేయడానికి సిద్దమేనని... ఈ ప్రభుత్వాన్ని కూడా కాళ్లకాడికి తీసుకువస్తానని అన్నారు. మునుగోడు ప్రజలకోసం ఏ త్యాగానికైనా సిద్దం... ఎంత దూరమైనా వెళతాను.. ఎవరికి భయపడేరకం కాదని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని హామీఇచ్చి పార్టీలోకి రమ్మన్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇక భువనగిరి లోక్ సభ స్థానాన్ని గెలిపిస్తే, ఎల్బి నగర్ లో పోటీచేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఇలా రెండుమూడుసార్లు ఇచ్చిన హామీని మరిచి పార్టీ మారినవారికి పదవులు ఇచ్చారని... తనలాంటివారిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికాల్లో మొక్కి పదవులు తెచ్చుకోలేను... కాబట్టి మంత్రి పదవికి ఇస్తారా ఇవ్వరా అన్నది వారి ఇష్టం అన్నారు రాజగోపాల్ రెడ్డి.
మంత్రిపదవా? మునుగోడు ప్రజలా? అంటే తాను మునుగోడు ప్రజలే కావాలంటానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పదవుల వెనకాల పాకులాడాల్సిన అవసరం తనకు లేదు… పదవులు వాటంతట అవే రావాలన్నారు. పదవులు అడ్డం పెట్టుకుని వేలకోట్లు దోచుకుంటున్నాని అన్నారు. తాను మనసు చంపుకుని పదవులు అడగనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎంకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చురకలు :
ఇటీవల సోషల్ మీడియా జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ''ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు'' అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
మరో సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కోమటిరెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ''రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు'' అని హెచ్చరించారు.
