హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్ పదవికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారంటూ వస్తున్న ప్రచారం నేపథ్యంలో నేతలు పోటీ పడుతున్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పుపై నేతలు చర్చించారు. వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్ ను మార్చాలని కోరారు. 

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ పదవిపై కొందరు ఆశావాహులు తన మనసులోని మాట బయటపెట్టారు. తమకంటే తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు వి.హన్మంతరావులు పీసీసీ చీఫ్ పదవిపై ఆశపడుతున్నట్లు తెలిపారు.

భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలంటూ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు మెురపెట్టుకున్నారు. ఎప్పటి నుంచో తాను పీసీసీ చీఫ్ పదవి కోసం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో తాను పీసీసీ చీఫ్ పదవి కానీ ఆనాడు ఇవ్వలేదని ఇప్పుడైనా ఇవ్వాలని కోరారు. ఇప్పుడైనా ఇస్తే తాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రుణం తీర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 

మరోవైపు గాంధీభవన్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. తమ నేత కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచో కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. పీసీసీ చీఫ్ పదవి లేకపోయినా ఏనాడు బాధపడలేదన్నారు.   

ఇకపోతే గాంధీభవన్ లో మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ సమక్షంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు వాగ్వాదానికి దిగారు. మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీల మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను రిటైర్మెంట్‌కు వచ్చానని షబ్బీర్ అలీ విమర్శిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. 

దీంతో ఇద్దరు నేతల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలకు అన్యాయం జరుగుతోందని ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులకు పెద్దపీట వేస్తున్నారంటూ వీహెచ్ ఆరోపించారు. 

ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను శవాలంటే ఊరుకునేది లేదని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో వీహెచ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అలీ వ్యాఖ్యానించారు. ఆజాద్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 

అయితే ఇటీవల జరుగుతున్న వరుస ఎన్నికలలో పార్టీ పరాజయం పాలవ్వడం పట్ల కేడర్ అసంతృప్తిగా ఉన్నారని ఈ నేపథ్యంలో పీసీసీలో మార్పులు చేస్తే బాగుంటుందని కొందరు అజాద్ కు సూచించారు. లేని పక్షంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని మరో నేత సైతం అభిప్రాయపడ్డారు.

 ఈ వార్తలు కూడా చదవండి

గాంధీభవన్‌లో రచ్చరచ్చ: ఆజాద్ ముందే వీహెచ్-షబ్బీర్ అలీ మాటల యుద్ధం