పెద్ద పెద్ద మాటలు చెప్పి తుస్సుమనిపించారు: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి సంచలనం
తెలంగాణ గవర్నర్ అసెంబ్లీ బయట పెద్దపులిలా వ్యాఖ్యలు చేసి సభలో మాత్రం పిల్లి తీరుగా వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్:పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రసంగంలో గవర్నర్ తుస్సుమనిపించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంతో శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ స్పందించారు.గవర్నర్ బయట చాలా నరికారన్నారు. పులి తీరుగా బయట గాండ్రించారని ఆయన గుర్తు చేశారు. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని ఆయన వ్యాఖ్యానించారు.
గత్యంతరం లేకే గవర్నర్ మాట్లాడారన్నారు. .గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని ఆయన చెప్పారు. బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ మారిందని ఆయన ఆరోపించారు.
బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపలేదనే కారణంగా గత నెల 30వ తేదీన హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో ఇరు వర్గాల న్యాయవాదులు చర్చించుకోవాలని హైకోర్టు సూచించింది. లంచ్ బ్రేక్ సమయంలో ఇరు వర్గాల న్యాయవాదులు చర్చించారు. ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణానికి స్వస్తి పలికేందుకు అనువైన వాతావరణం కోసం చర్చించారు.
గవర్నర్ పై ప్రభుత్వం విమర్శలు మానుకోవాలని గవర్నర్ తరపు న్యాయవాది ఆశోక్ కోరారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వం కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దుశ్వంత్ ధవే ఈ మేరకు హమీ ఇచ్చారు.
also read:రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య సయోధ్య: బడ్జెట్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం
ఇదే విషయాన్ని హైకోర్టుకు ఇరు వర్గాల న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం కూడ లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. అదే రోజు రాత్రి రాజ్ భవన్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలను ప్రసంగించేందుకు ఆహ్వానం పలికారు. దీంతో ఇవాళ గవర్నర్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.