ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 9వ తేదీన ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 9వ తేదీన ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అయితే కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని ఆరోపిస్తున్నారు. రెండు పార్టీల రాజకీయ డ్రామాలో భాగంగానే ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. కవితకు గతంలో సీబీఐ నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. తాజాగా ఈడీ కూడా నోటీసులు ఇచ్చిందని.. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలో ఇదొక భాగం అని ఆరోపించారు.
ఒకవేశ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే.. దానిద్వారా బీజేపీ, బీఆర్ఎస్‌లు రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని తాము మొదటి నుంచి తాము చెబుతున్నామని అన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీని పెంచే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు పడే ఓటును చీల్చడమే బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కవిత మంటగలిపారని విమర్శించారు. డబ్బులకు ఆశపడి మహిళలు చేయరాని లిక్కర్ వ్యాపారంలో కవిత పాలుపంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని కవిత దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కవిత అరెస్ట్‌ను ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. మహిళ దినోత్సవం రోజు మహిళ గురించి ఏం మాట్లాడతామని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారని అన్నారు.
Also Read: తెలంగాణ తలవంచదు, విచారణకు సహకరిస్తా: ఈడీ నోటీసులపై కవిత
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే చార్జ్‌షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కోర్టు.. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ అని తెలిపింది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్‌లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండోస్పిరిట్‌లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్‌కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది.
ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, ఏపీ వైఎస్ఆర్‌సీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఇక, ఈ కేసుకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్ళైని కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా.. 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీచేశారు. గురువారం (మార్చి 9)రోజున ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
