హైదరాబాద్: పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుర్రపు బండిపై కలెక్టరేట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దేశ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది.ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రపు బండిపై గాంధీ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శనకు ప్రయత్నించారు. 

కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

దేశ వ్యాప్తంగా వరుసగా పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో కూడ పెట్రోల్ , డీజీల్ ధరలు తగ్గించలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.

అసలే కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరో వైపు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచడంతో మరింత నష్టపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజీల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.