ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇటీవలే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే సీఎం జగన్‌కు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2014లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలో నిలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. వైఎస్ జగన్‌తో మాత్రం పొంగులేటి సత్సబంధాలు కొనసాగిస్తూనే వచ్చారు.
అయితే తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిన పొంగులేటి.. ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించి బయటకు వచ్చి సొంత పార్టీని నడుపుతున్న వైఎస్ జగన్‌తో భేటీ కావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే జగన్‌తో స్నేహపూర్వక సంబంధాలు, ఏపీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొన్ని కాంట్రాక్ట్స్ నిర్వహిస్తూ ఉండటం కారణంగానే.. ఈ బేటీ జరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన జగన్ సోదరి వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే జగన్‌తో పొంగులేటి భేటీ సందర్భంగా.. ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది.
